రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. ప్రభుత్వం నిలబడాలంటే… కాంగ్రెస్ కు ఓటేయాలన్నట్లుగా ప్రజల్లోకి అంతర్గతంగా సందేశం పంపుతోంది. లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్‌కు విపక్షాలు మంచి అస్త్రం ఇచ్చాయని వారు చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటున్నారు.
ప్రభుత్వం బలహీనంగా ఉందన్న అభిప్రాయం కలిగేలా.. బీఆర్ఎస్ , బీజేపీ ప్రకటనలు చేస్తున్నాయి. ఇది ఓ రకంగా మైండ్ గేమ్. కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారనీ, ఏ క్షణాన్నయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాదు బీజేపీనే కూలుస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మహారాష్ట్రలో ఏం జరిగిందో చూశారు కదా అంటున్నారు.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా కాకముందే కేటీఆర్, హరీశ్ కూడా ఆరోపణలు సంధించడం మొదలుపెట్టారు. నిజానికి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనేది వారికి తెలియని విషయం కాదు. కానీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడకముందే, పార్టీలు ఇంత దూకుడుగా ఉన్నాయి. ఎన్నికలవేడి రాజుకున్నాక, ఈ మైండ్ గేమ్ మరింత తీవ్రతరం అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రెండు పార్టీల మైండ్ గేమ్‌తో రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నారు. ఆయన చాలా క్లియర్‌గా చెప్పాల్సింది చెబుతున్నారు. కేసీఆర్ రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందర్నీ చేర్చుకున్నారని అయినా ఓడిపోయారు కదా అని గుర్తు చేస్తున్నారు. తాము ఎవర్నీ తీసుకోవాలనుకోవడం లేదని.. కానీ బీఆర్ఎస్ లేదా బీజేపీ ప్రయత్నం చేస్తే మాత్రం కల్ట్ చూపిస్తానని ఆయన వార్నింగ్ ఇస్తున్నారు.