తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో. విపక్షాలు చేసే రాజకీయాలు కూడా ఆయనకు కలసి వస్తున్నాయి. సొంత పార్టీ నేతల్ని కూడా విపక్ష నేతలే దారికి తెచ్చి రేవంత్ రెడ్డికి ఏకపక్షంగా మద్దతు పలికేలా చేస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదేళ్లు రేవంతే సీఎంగా ఉంటారని ప్రకటించారు. ఆయన ప్రకటన కాంగ్రెస్ నేతల్ని ఆశ్చర్య పరిచిది. ఎందుకంటే పీసీసీ చీఫ్ గానే రేవంత్ నుఅంగీకరించని కోమటిరెడ్డి… గాంధీభవన్ మెట్లెక్కేది లేదని ప్రతిజ్ఞ చేసిన సందర్భం ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయన పదేళ్లు సీఎంగా ఉంటారని ప్రకటించారు. దీనికి కారణం బీఆర్ఎస్, బీజేపీ చేసిన రాజకీయమే.
కోమటిరెడ్డి మరో షిండే అవుతారని ఆయనను బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ చేసుకున్నాయి. పదే పదే అలాంటి ప్రకటనలు చేయడంతో కోమటిరెడ్డికి తన నిజాయితీని నిరూపించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ కూల్చివేత హెచ్చరిలను అడ్వాంటేజ్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఓ పది మంది తప్ప..ఎవరూ యాక్టివ్ గా లేరు. వారంతా పార్టీలో ఉంటారా పోతారా అన్నది బీఆర్ఎస్ వారికే తెలియడం లేదు.
ప్రభుత్వ మనుగడపై . కాంగ్రెస్ లోని అంతర్గత రాజకీయాలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లను అనుకూలంగా మల్చుకుని రేవంత్ రెడ్డి రోజు రోజుకు బలపడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయన బీజేపీ తల్చుకున్నా కూడా కూల్చలేనంతగా మద్దతు పొందుతారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తూంటే.. రేవంత్ రెడ్డి కోసమే…కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాలను కూడా సాఫీ చేయడానికి.. విపక్ష పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.