భారత రాష్ట్ర సమితి క్యాడర్ లో ఉనికి బయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ఒకటి చేయాలని.. ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని హైకమాండ్ పై ఏదో రూపంలో ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కేటీఆర్ పాదయాత్ర చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. త్వరలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను కలుపుతూ కేటీఆర్ పాదయాత్ర చేస్తారని ప్రచారం చేస్తున్నారు. కానీ పార్టీ వైపు నుంచి అధికారికంగా ఎలాంటి లీక్ రాలేదు.
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర పెద్ద అస్త్రం . అయితే అది అందరికీ వర్కవుట్ అయ్యే సూచనలు లేవు. షర్మిల తెలంగాణ మొత్తం పాదయాత్ర చేశారు కానీ.. కనీసం తనకైనా డిపాజిట్ వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి సైడ్ అయిపోయారు. బండి సంజయ్ కూడా విడతల వారీగా పాదయాత్ర చేశారు కానీ హై మూమెంట్లో ఆయనను టీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించడంతో కథ మారిపోయింది. ఏపీలో నారా లోకేష్ చేసిన యవగళం పాదయాత్ర టీడీపీకి అధికారాన్ని దగ్గర చేసింది.
కేటీఆర్ కూడా అదే తరహాలో పాదయాత్ర చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ క్యాడర్ ఆలోచన. అందుకే ఆయనపై ఒత్తిడి పెంచేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడే అలాంటి ప్రయత్నాలు చేయలేమని.. ఎన్నికలకు ఏడాది లేదా ఏడాదిన్నర ముందు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ అప్పటి వరకూ ఉంటే.. జరగాల్సిన నష్టం జరిగిపోతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.