ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి ప్రయత్నంగా ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బెదిరిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం ప్రారంభించారు. ఈ సారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానన్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టమని హాట్ కామెంట్స్ చేశారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, ఫలితాలలో తనను గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ఒక్క సారి తనకు అవకాశం కల్పించాలని 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కౌశిక్ రెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. పూర్తిగా ఆశలు వదిలేసుకుని చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఆయన వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. రౌడీయిజం తరహాలో ఆయన చేసే పనులపై వ్యతిరేకత ఉంది. ఈటల రాజేందర్ కు ప్రతి గ్రామంలో పట్టు ఉంది. అందుకే ఆయన గజ్వేల్ లోనూ పోటీ చేస్తున్నారు. రాష్ట్రమంతా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు.
ఈటల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. కానీ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ ఆయనకు ఇవ్వలేదు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నిలబడిన విద్యార్థి నేత గెలవకపోవడంతో ఆయనను పూర్తిగా తొక్కేశారు. ఈటలకు తానే సరైన నాయకుడ్ని అనిపించుకుని టిక్కెట్ ఖరారు చేయించుకున్నారు. అయితే ఇప్పుడు గెలిపించకపోతే చచ్చిపోతానని ఓటర్లను బెదిరిస్తున్నారు.