సీఎం కేసీఆర్ ముందే టిక్కెట్లు ప్రకటించిన సంతోషం.. బీఆర్ఎస్ సిట్టింగ్లకు.. టిక్కెట్లు పొందిన వారికి.. ఎక్కువ కాలం ఉండటం లేదు. కారణం ఖర్చులే. రాజకీయాలంటే ఖర్చు. అది ఆషామాషీ ఖర్చు కాదు. ఊహించనంత ఖర్చు పెట్టుకోవాలి. అదీ ముందుగానే రంగంలోకి దిగితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున టిక్కెట్లు పొందిన వారి పరిస్థితి అంతే ఉంది. టిక్కెట్ దక్కిందనే ఆనందం కంటే… ఇప్పటి నుంచి పెట్టాల్సిన ఖర్చు చూస్తేనే నీరసం వస్తోందని నేతలు మథనపడుతున్నారు.
చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి లెక్కలేనంత సంపాదించుకుని ఉంటారని.. మా సంగతేమిటని.. ద్వితీయ శ్రేణి నేతలు అలుగుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల సమయం అంటే పండగే. వారి కోరికలను అభ్యర్థులు తీర్చాల్సిందే. లేకపోతే ప్రత్యార్థి పార్టీ నేతలు రెడీగా ఉంటారు. చోటా మోటా నేతలు, కార్యకర్తలను కాపాడుకునేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తోంది.
వరసగా వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గాల్లోని ప్రతీ ఊరుకి గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పూజలు, ఊరేగింపులు, భజనల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు వారిని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. ఇక ప్రతీ రోజూ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాల కోసం లక్షల్లో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఆర్థికంగా స్థితిమంతులు తట్టుకుంటున్నారు.. కానీ సంపాదించుకున్నదంతా ఖర్చయిపోతుందన్న ఆవేదనా వారికీ ఉంది.