జగన్ రెడ్డి పాలనలో విధ్వంసమైన ఏపీని బూచిగా చూపుతూ తెలంగాణ నెంబర్ వన్ అంటూ గతంలో బీఆర్ఎస్ తెగ ప్రచారం చేసుకునేది. ఏపీ కంటే తెలంగాణ అన్ని విషయాల్లో మెరుగ్గా ఉందంటూ వ్యాఖ్యానించేవారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు కూడా మారాయి. పక్క రాష్ట్రమైన ఏపీని చూసి తెలంగాణ సర్కార్ నేర్చుకోవాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడంతో ఏపీ ప్రజలు కోరుకున్న మార్పుకు ఇదే సంకేతమని టీడీపీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. 16వేల టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగానే డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేశారు. సామాజిక పెన్షన్ సాయాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ముందు ఉంచుతూ హరీష్ రావు… తెలంగాణ సర్కార్ ఏపీని చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికారు.
తెలంగాణలో కాంగ్రెస్ కూడా పెన్షన్ లను 4 వేలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు పెన్షన్ల పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ హాయాంలో ఇచ్చినట్టుగానే 2వేల పెన్షన్ ఇస్తోంది. ఈ క్రమంలోనే ఈ హామీలను నెరవేర్చాలని కోరుతూ హరీష్ రావు ,హామీల అమలుపై ఏపీ సర్కార్ ను చూసి నేర్చుకోవాలంటూ రేవంత్ ప్రభుత్వానికి సూచించారు.
గతంలో తెలంగాణను చూసి ఏపీ నేర్చుకోవాలని మాట్లాడిన నేతలే ఇప్పుడు ఏపీని చూసి నేర్చుకోవాలని మాట్లాడుతున్నారంటే ఇది చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శమని టీడీపీ శ్రేణులు కొనియాడుతున్నాయి.