తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల అయింది. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ లోనూ ఈ సందడి కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క స్థానం కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి మధుసూదనాచారి వరకూ కనీసం ఓ ముఫ్పై మంది స్థాయి ఉన్న నాయకులు అవకాశం కోసం ఫామ్ హౌస్ వద్దకు వెళ్తున్నారు.
పదవి విరమణ చేస్తున్న వారిలో నలుగురు బీఆర్ఎస్, ఒకరు మజ్లిస్ కు చెందిన వారు. సత్యవతి రాథోడ్ మండలిలో విప్ గా ఉన్నారు. ఆమె తనకు మరో అవకాశం ఇస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి, స్వామిగౌడ్, వీజి గౌడ్, రాజయ్యతో పాటు గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చినా సరైన సమయంలో ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడిన దాసోజు శ్రవణ్ కూడా తనకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు.
ఒకరిని కాదని ఇంకొకరికి ఖరారు చేస్తే అసంతృప్తి వ్యక్తమవుతుంది. అందుకే కేసీఆర్ గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇతరులకు ఎవరికి ఇచ్చినా సమస్య వస్తుందని.. ప్రస్తుతం పదవి కాలం ముగుస్తున్న సత్యవతి రాథోడ్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నామినేషన్ల రోజు వరకూ నిర్ణయం తీసుకోకపోవచ్చని భావిస్తున్నారు.