దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎడెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట లేరు. అనర్హతా వేటు కోసం ఫిర్యాదు చేసినట్లుగా మీడియాలో ప్రచారం జరగగానే.. మీరేం చేశారో గుర్తు లేదా.. లేకపోతే ప్రజలు మర్చిపోయి ఉంటారనుకుంటున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
గతంలో ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేకపోయినా కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంది. వీరిలో ఒక్కరిపైనా అనర్హతా వేటు వేయలేదు. పైగా శాసనభాపక్షం విలీనం అంటూ ప్రచారం చేశారు.
మొదటి విడతలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. తరవాత కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్ల పైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని అందుకే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని అంటున్నారు.
దానం నాగేందర్ పై అనర్హతా వేటు పిటిషన్ వేసే ముందు కొద్దిగా ఆలోచించాల్సి ఉందని.. బీఆర్ఎస్లోనే సెటైర్లు వినిపిస్తున్నాయి.