రేవంత్ రెడ్డి మూడు గంటలే ఉచిత విద్యుత్ ఇస్తామన్నారంటూ .. తాము ఇరవై నాలుగు గంటలు ఇస్తు్న్నామని.. మూడు పంటలకు నీరు కావాలంటే బీఆర్ఎస్కు… మూడు గంటల విద్యుత్ కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి అమెరకా నుంచి వచ్చిన తర్వాత కౌంటర్ ఇచ్చారు. ఉచిత విద్యుత్ పేరుతో.. కమిషన్లు నొక్కేస్తున్నారని.. ఎక్కడైనా సరే.. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. అందు కోసం సబ్ స్టేషన్ల వద్ద లాగ్ బుక్లు పరిశీలిద్దామని చాలెంజ్ చేశారు.
అన్నట్లుగానే కాంగ్రెస్ నేతలు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేసి.. లాగ్ బుక్ లను పరిశీలించారు. అందులో ఎక్కడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నట్లుగా లేదు.కనీసం ఏడుగంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ రిలీజ్ చేశారు. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్నర్ అయినట్లయింది. ఎక్కడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో విస్తృతం ప్రచారం జరగడంతో.. డ్యామెజ్ కంట్రోల్ కోసం.. హరీష్ రావు రంగంలోకి దిగారు.
తాము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నామని ఎక్కడా చెప్పలేదు కానీ..గతంలో కాంగ్రెస్ ఏడు గంటలు కూడా ఇవ్వలేకపోయిందని.. చెప్పుకొచ్చారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే అలాంటి పరిస్థితే వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి అనని దాన్ని అన్నట్లుగా ట్విస్ట్ చేసి వివాదం రేపిన బీఆర్ఎస్కు విద్యుత్ విషయంలో ఇబ్బందికర పరిస్థితి రెండు రోజుల్లోనే ఎదురవడంతో కాంగ్రెస్ నేతల ఎదురుదాడి ఎక్కువగా ఉంది.