తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన గనుల వేలంలో బీఆర్ఎస్ బాగోతం ఆలస్యంగా బయటకు వచ్చింది. పదేండ్లపాటు రాష్ట్ర ఖనిజ సంపదను కాపాడామని చేస్తోన్న బీఆర్ఎస్ వాదనకు , అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలకు అసలే మాత్రం పొంతన లేదని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీలు కూడబల్కొని ఖనిజ సంపదను ప్రైవేట్ పరం చేస్తున్నాయని గగ్గోలు పెడుతోన్న బీఆర్ఎస్సే.. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రానికి వేలం ప్రతిపాదనలు పంపినట్లు తేలింది.
కేంద్రం నోటిఫై చేసిన 11 గనుల్లో కనీసం ఆరింటికైనా జూన్ 30వ తేదీలోపు వేలం ప్రక్రియను పూర్తి చేయాలని ఈ నెల 16న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత తక్కువ కాల వ్యవధితోనే గనుల వేలానికి కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానించింది. గత ప్రభుత్వ నిర్ణయాలను ఆరా తీయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లాలోని పసుపులబోడు, సైదులనామా , సుల్తాన్ పూర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో లైమ్ స్టోన్ గనులను వేలం వేయడానికి నాటి బీఆర్ఎస్ సర్కార్ 2018 అక్టోబర్ 5న కేంద్రానికి లేఖ రాసి.. ఇందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది. పర్యావరణ సంబంధిత అంశాలతో ముడిపడినది కావడంతో కేంద్రం పర్మిషన్ కోరింది.
కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తిరిగి 2019లో కేంద్రానికి రిమైండర్ పంపింది బీఆర్ఎస్ సర్కార్. అయినా ఎలాంటి రిప్లై లేకపోవడంతో 2020 సెప్టెంబర్ 16న మళ్లీ రిమైండర్ పంపింది. ఈ గనుల వేలానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి రిమైండర్ లో పేర్కొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే గనుల వేలానికి అంగీకరించినందున ముందస్తు పర్మిషన్ అవసరం లేదని, వేలం ప్రక్రియను కొనసాగించవచ్చునని కేంద్రం 2021 డిసెంబర్ 12న మూడు లైమ్ స్టోన్ లను లీజ్ కు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక వీటికి కొనసాగింపుగానే వేలం ప్రక్రియను స్పీడప్ చేయాలంటూ కేంద్రం ఇటీవల ఆదేశించింది.
బీఆర్ఎస్ మాత్రం తాము తెలంగాణ సంపదను కాపాడితే కాంగ్రెస్ అద్గికారంలోకి వచ్చాక కేంద్రంతో కుమ్మకై ప్రైవేట్ పరం చేస్తోందని కొద్దిరోజులుగా విమర్శలను ఎక్కుపెట్టింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ సర్కార్ ఆరా తీయగా అసలు విషయాలు బయటకు రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నీళ్లు నములుతున్నారు.