విద్యుత్ ఒప్పందాల విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి చేస్తున్న విచారణ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న హడావుడి చూస్తే ప్రజల్లో ఏదో జరిగిందన్న అనుమానాలు రావడానికి కారణం అవుతోంది. కేసీఆర్ పన్నెండుపేజీల సుదీర్ఘ లేఖ రాసి ఆయనను విచారణ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు, విచారణాధికారిపై ఆరోపణలు చేశారు. కానీ నిర్దిష్టంగా విద్యుత్ ఒప్పందాలు అవినీతి ఆరోపణల విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు.
పైగా తెలంగాణ ఏర్పడక ముందుఅంతా చీకటేనని తాను వచ్చాక వెలుగులు తెచ్చానని చెప్పుకుంటున్నారు. ఆ విషయం వంద శాతం నిజం అయినా సరే… అక్కడ టాపిక్ అది కాదు. ఆ వెలుగుల పేరుతో చేసిన అవినీతి మాత్రమే టాపిక్. తాను మంచిగా చేశానని అందులో కొంత కమిషన్లు తీసుకున్నానని అంటే… అది నేరమే అవుతుంది. ఈ లాజిక్ నుు బీఆర్ఎస్ పట్టుకోవడం లేదు. చత్తీస్ ఘడ్ విద్యుత్ విషయంలో మొదట్లోనే ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ పట్టించుకోలేదు.
తర్వాత విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉపయోగించే టెక్నాలజీపైనా ఆరోపణలు వచ్చాయి. క్రమబద్దమైన అవినీతి జరిగిందని అనుమానాలు వచ్చినా .. అధికారం తమ చేతుల్లోనుంచి పోదని.. పోయినా ఎవరూ ఏం చేయలేరన్నట్లుగా వ్యవహరించారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. నిజానికి కేసీఆర్ కు వివరణ ఇచ్చుకోవడానికి కావాల్సినంత సమయం ఇచ్చారు. కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోదు. విచారణ జరిపి కేవలం నివేదిక మాత్రమే ఇస్తుంది. అయినా బీఆర్ఎస్ కంగారు పడుతోంది. అందుకే ఇందులో ఏదో ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.