కొడంగల్ నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుట్ర పన్నింది ఆయనేనని పోలీసులు గుర్తించారు. ఫార్మా పరిశ్రమల విషయంలో భూసేకరణ అంశంలో గ్రామస్తులను రెచ్చగొట్టేందుకు.. వారితో దాడులు చేయించేందుకు ఆయన కొంత కాలంగా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సురేష్ అనే తన అనుచరుడి ద్వారా కలెక్టర్ పై దాడి చేయించినట్లుగా తేల్చి పోలీసులు అరెస్టు చేశారు.
కలెక్టర్ పై దాడి జరిగిన లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయసేకరణ లేదు. ఆ గ్రామానికి సమీపంలో ఉన్న గ్రామంలో గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో సురేష్ అనే వ్యక్తి వచ్చి.. తమ గ్రామంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారని వచ్చి మాట్లాడాలని కోరారు. వారి సమస్యలు వినేందుకు స్వయంగా కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లారు. వెళ్లిన వెంటనే ఎలాంటి సమస్యలు చెప్పుకోకుండా కలెక్టర్ పై దాడిచేశారు. దీంతో అసలు కుట్ర ప్రకారమే ఆయన కలెక్టర్ ను తీసుకెళ్లారని స్పష్టమయింది. గత రెండు రోజుల్లో సురేష్ నలభైసార్లకుపైగా పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడారు. అక్కడే కుట్ర జరిగిందని పోలీసులు గుర్తించారు.
రాజకీయనేతలపై దాడులు చేస్తే విషయం సీరియస్ కాదు. కానీ అక్కడ జరిగింది కలెక్టర్ పై దాడి. రేవంత్ రెడ్డి ఈ అంశంపై చాలా సీరియస్ గా స్పందించారు. అధికారుల్ని చంపాలని ప్రయత్నించిన వారిని..త వారికి మద్దతుగా ఉన్న వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారవర్గాలు కూడా దీన్ని తేలికగా తీసుకోకూడదని నిర్ణయించారు. కుట్ర ప్రకారమే ఘటన మొత్తం జరిగిందని తేల్చారు.
పట్నం నరేందర్ రెడ్డి … ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు. ఇద్దరూ కలిసే రాజకీయాలు చేస్తారు. ఎన్నికల తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి..తన భార్యను మల్కాజిగిరి నుంచి పోటీ చేయించారు కానీ ఓడిపోయారు. సోదరుడు నరేందర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నారు . కొడంగల్‌లో 2019లో రేవంత్ పై గెలిచారు.