ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొంత మంది పోలీసు రావులు ఇస్తున్న కన్ఫెషన్ రిపోర్టులు సంచలనంగా మారుతున్నాయి. వారి రిపోర్టుల ప్రకారం చూస్తే.. తెలంగాణలో వ్యవస్థలన్నీ బీఆర్ఎస్ గుప్పిట్లోనే ఉన్నాయి. ఎన్నికలన్నీ ఆ పార్టీ అనుకున్నట్లుగానే జరిగాయి. అయినా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అంటే… ప్రజలు ఒక్క సారి డిసైడ్ అయితే.. వ్యవస్థలు కాదు కదా… గొంతు మీద పీక పెట్టినా సరే ఓడించి తీరుతారని స్పష్టమయింది.
ఉపఎన్నిక.. అసలు ఎన్నిక ఏది జరిగినా కీలక స్థానాల్లో ఉన్న కొంత మంది ఆఫీసర్ రావు మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. డీజీపీగా మహేందర్ రెడ్డి ఉన్నా ఆయన మాట ఎవరూ వినేవారు కాదు. ఆయనను కేసీఆర్ తప్పించలేదు కానీ.. పవర్ మాత్రం ఇవ్వలేదు. ఈ అసంతృప్తి ఆయనలో ఉందని తర్వాత బయటపడింది. కాంగ్రెస్ సర్కార్ లో ఆయనకు ఎపీపీఎస్సీ చైర్మన్ పోస్ట్ వచ్చింది. ఈ ఆఫీసర్ రావులంతా వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆటాడించారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్నీ అందించడం… ప్రత్యర్థి పార్టీలకు ఏదీ దొరకకుండా చేయడం అనే మిషన్ అమలు చేశారు. తమ వాహనాల్లో బీఆర్ఎస్ నేతలకు డబ్బులు పంపారు. ట్యాపింగ్ చేసి.. ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడెక్కడ ఉంటాయో మొత్తం కనిపెట్టి పట్టుకునేవారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు బ్యాంకుల్లో డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినా ఇట్టే తెలుసుకునేవారు. అయితే ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయన్ని మాత్రం ఆపలేకపోయారు. అదే ప్రజాస్వామ్యం. అధికారంలో ఉన్న వారు… ఆ అధికారం సాయంతో.. అడ్డగోలు పనులు చేసైనా అధికారాన్ని నిలబెట్టుకుంటామంటే.. ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు. తెలంగాణలో జరిగింది అదే.