తెలంగాణలో బీఆర్ఎస్ భయపడినంత జరిగింది. ఒక్క పార్లమెంట్ సీటు కూడా రావడం లేదు. పదిహేడు చోట్ల వెనుకబడి ఉన్నారు. కొద్ది తేడాతో వెనుకబడి ఉంటే.. చివరి రౌండ్లలో అయినా ముందుకొస్తారన్న ఆశ ఉండేది. కానీ అది కూడా లేదు. చాలా చోట్ల మూడో స్థానంలో తచ్చాడుతున్నారు. చివరికి సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే మెజార్టీతో పార్లమెంట్ గెవాల్సిన మెదక్ లో కూడా వెనుకబడిపోయి ఉన్నారు.
ఎన్నికల సమయంలో తాను ప్రధాని రేసులో ఉన్నానని కేసీఆర్ అదే పనిగా ప్రచారం చేసుకున్నారు. వైనాట్ అంటూ కేఏ పాల్ తరహాలో మాట్లాడారు. ఏపీలో జగన్ గెలుస్తారంటూ తన జోస్యం వినిపించారు. తనకు సమాచారం ఉందని అదే పనిగా వ్యాఖ్యలు చేశారు. అది ఆయన కోరిక కావచ్చు కానీ.. తనకు తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదన్న సమాచారం ఆయనకు ఎవరూ ఇవ్వలేదేమో కానీ ఇప్పుడు పరువు పోయింది.
పరిపాల పరంగా బాగా చేసినప్పటికీ అడ్డగోలు రాజకీయాలు చేసిన ఫలితంగానే బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పుడు కనీస బలం కూడా లేకపోవడంతో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు అంతా పక్క చూపులు చూడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు అయిపోయాక తన పార్టీలో ఎంత మంది ఉంటారో.. ఎంత మంది వెళ్లిపోతారో అన్న సమాచారం అయినా రావు గార్లకు ఉందో లేదో మరి !