స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిందని తాము బిడ్ దాఖలు చేస్తున్నామన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ కలరింగ్ ఇస్తూ ప్రచారం ప్రారంభించుకుంది. రాజకీయ పార్టీలు అంతే హడావుడి చేస్తున్నాయి. కానీ అసలు నిజం మాత్రం వేరే ఉంది. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు ఎలాంటి బిడ్లు ఆహ్వానించలేదు. ‘‘వర్కింగ్ క్యాపిటల్ లేదా ముడి పదార్థాలు సరఫరా చేస్తే.. దానికి బదులుగా స్టీల్ ఇస్తాం’’ అన్న బిడ్ మాత్రమే.
గతనెల 27వ తేదీన విశాఖ ఉక్కు యాజమాన్యం ఈవోఐలో ‘‘ఉక్కు, ఉక్కు ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలతో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాం’’ అని మాత్రమే తెలిపింది. స్టీల్ తయారీ సంస్థలతో అనుబంధం, అనుభవం ఉన్నవారెవరైనా బిడ్ వేయవచ్చునని తెలిపింది. ఇలా వర్కింగ్ క్యాపిటల్ లేదా ముడి సరుకు ఇచ్చినందుకు స్టీల్ ప్లాంట్లో వాటాలేమీ ఇవ్వరు. దానికి బదులుగా స్టీల్ ఉత్పత్తులను సరఫరా చేస్తారు. పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఉక్కు తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల రంగంలో ఉన్న కంపెనీలు మాత్రమే ఈవోఐకి స్పందించి ముందుకురావాలని ఇందులో స్పష్టంగా చెప్పారు.
అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఇది ఉక్కు ప్రైవేటీకరణ అంటూ రాజకీయం ప్రారంభించేశాయి. ప్రజల్ని గందరగోళంలోకి ముంచెత్తుతున్నాయి. మీడియా సంస్థలు కూడా అసలు ఈవోఐలో ఏముందో తెలుసుకోకుండా రాజకీయ నేతల ప్రాపగాండాను ప్రజలపై రుద్దుతున్నాయి.