టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే ఆయన పిలుపునిచ్చినా ఇవ్వకపోయినా రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకునేంత పరిస్థితి బీఆర్ఎస్ క్యాడర్ కు లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, క్యాడర్ , లీడర్ వలసతో రోజు రోజుకు బక్క చిక్కిపోతోంది. ఉన్న వాళ్లుకూడా పెద్దగా పార్టీ కోసం పని చేసే పరిస్థితి లేదు.
2001 ఏప్రిల్ 27న పార్టీ ప్రకటించిన తర్వాత కేసీఆర్ అనే ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా తన వ్యూహాలతో ఎలాగోలా పార్టీని బతికించుకుంటూ వచ్చారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఇక పార్టీ పనైపోయిందనుకున్నారు. వైఎస్ ఆకర్ష్ దెబ్బకు తన పార్టీ కార్యాలయాన్ని కూడా లాక్కుంటారేమోనన్న భయంతో కేసీఆర్ తెలంగణ భవన్ లోనే పడుకున్న రోజులు వచ్చాయి. అయితే తర్వాత వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడంతో కేసీఆర్ ఒక్క సారిగా ఆమరణదీక్షతో రాజకీయం మార్చేశారు. అప్పట్నుంచి టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది. తెలంగాణ వచ్చింది. రెండు టర్ములు అధికారంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారో అప్పట్నుంచి మళ్లీ జాతకం రివర్స్ అయింది.
కేసీఆర్ ఉన్నంత కాలం ఆయనే సీఎం అని కలలు కన్న నేతలకు ప్రజలు షాకిచ్చారు. మాకు టీఆర్ఎస్ మాత్రమే తెలుసు. బీఆర్ఎస్ తెలియదని చెప్పి ఓడించారు. ఇప్పుడు మళ్లీ పార్టీని టీఆర్ఎస్ గా మార్చలేక… తాము తెలంగాణ కోసమే పుట్టామని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నమ్మక ద్రోహం చేశారని ప్రజలు అనుకున్న తర్వాత వారిని నమ్మించడం చాలా కష్టం. ఇప్పుడు కేసీఆర్ ఆ ప్రయత్నం చేస్తున్నారు . ఆరోగ్యం సహకరించకపోయినా బస్సు యాత్ర చేస్తూ జనంలోకి వెళ్తున్నారు.
ప్రతీ సారి అద్భుతాలు జరగవు. ప్రతీ సారి వ్యూహాలు ఫలించవు. అలాగని ఫలించకూడదని కూడా లేదు. కేసీఆర్ ప్రయత్నం ఫలించి.. పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిస్తే పార్టీ ఉంటుంది.. లేకపోతే వచ్చే ఆవిర్భావ దినోత్సవం నాటికి జెండా ఎగురవేయండి అని పిలుపునిచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇదంతా స్వయంకృతమే.