తెలంగాణ కోసం పుట్టిన పార్టీ… తెలంగాణ రాష్ట్రం కోసమే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోసమే తండ్లాట… ఇలా తమ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ ప్రజలకు కూడా టీఆర్ఎస్ అంటే ఓ తెలియని నమ్మకం ఉండేది.
కానీ, జాతీయ రాజకీయాల కోసం అంటూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లాగే బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. పేరు మారిందే కానీ తెలంగాణపై ప్రేమ మారలేదని కేసీఆర్ అండ్ టీం ఎంత చెప్పుకున్నా తెలంగాణ ప్రజలతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది. ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలకు అర్థం అవుతోంది.
తెలంగాణ ప్రజలతో టీఆర్ఎస్ పార్టీది పేగు బంధం అని కేవలం రాజకీయాలు కాదని గులాబీ నేతలు చెప్పుకునే వారు. కానీ, పార్టీ పేరు మారక ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చింది. కిందిస్థాయి లీడర్లకు ఆ నిర్ణయం నచ్చకున్నా కేసీఆర్ మాటకు ఎదురు చెప్పలేక ఓకే అన్నారు.
కానీ, పరిస్థితులు మారిపోయాయి. పదేళ్ల పాలన చేసిన పార్టీకి 100రోజుల ప్రతిపక్ష పాత్రలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలా తయారైంది. దీంతో గులాబీ దళంలో పునరాలోచనలో పడింది. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ కు మారటం అంత హిజీ కాదు. టీఆర్ఎస్ పేరు మార్చుకోగానే సిద్ధిపేటకే చెందిన ఓ వ్యక్తి టీఆర్ఎస్ పార్టీని రిజిస్టర్ చేయించుకున్నారు. తను ఒప్పుకుంటే కానీ ఇప్పుడు పార్టీ పేరు మారదు. అయితే, టీఆర్ఎస్ రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తి హరీష్ రావు చెప్తే వింటారన్న అభిప్రాయం ఉన్న తరుణంలో… మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఓ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన ఉందని… దీనిపై కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారని పార్టీ పేరు మార్పును చెప్పకనే చెప్పారు. చూడాలి మరీ… పేరు మార్చిన తర్వాత టీఆర్ఎస్ తలరాత మళ్లీ మారుతుందో లేదో!