మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పోటీ చేస్తుదని వేగంగా జాతీయ హోదా తెచ్చుకుంటామని కేటీఆర్ నమ్మకంగా మీడియా ప్రతినిధుల్ని పిలిచి.. మంచి టిఫిన్ పెట్టి ..చిట్ చాట్‌గా మాట్లాడుతూ చెప్పారు. కానీ కాసేపటికే కర్ణాటకలో కుమారస్వామి అసలు విషయం చెప్పారు. కర్ణాటకలో భారత రాష్ట్ర సమితి పోటీ చేసే చాన్సే లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదని… తెలుగువారు ఎక్కువ ఉన్న చోట బీఆర్ఎస్ .. జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందన్నారు.
అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రం తెలంగాణ శివారు ప్రాంతాలైన ఒకటి, రెండు స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ పోటీచేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అంటే.. జేడీఎస్ నేత కుమారస్వామి.. బీఆర్ఎస్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. అది కర్ణాటకలో పోటీ చేయదని.. జాతీయ స్థాయిలో మాత్రం కాస్త మద్దతు ఉన్నట్లుగా ఉంటుందని కలిశామన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇంత హడావుడి చేసిన తర్వాత కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ చేయకపోతే … ట్రోలింగ్‌కు గురవ్వాల్సి వస్తుంది.
కేటీఆర్ మహారాష్ట్రలో ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో స్పష్టత లేదు. ఆయనకు మజ్లిస్ తో మాత్రమే అవగాహన ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మజ్లిస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ముస్లిం జనాభా అధికారంగా ఉన్న చోట బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే అక్కడైనా ఇలాంటి చాన్స్ వస్తుందా లేకపోతే.. కుమారస్వామి తరహాలో స్పందిస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయమే .