“తప్పు చేశారు..దిద్దుకోండి” అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ దగ్గర్నుంచి కింది స్థాయి నేతల వరకూ అదే ప్రచార వ్యూహం పాటిస్తున్నారు. కాంగ్రెస్ ఇస్తామన్న పథకాలకు ఆశపడి ఓటేశాలు. ఇప్పుడు మొత్తం కోల్పోయారు. మళ్లీ తప్పు చేయకుండా బీఆర్ఎస్ ఓటేయమని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రచార తీరు చూసి.. ఇతర పార్టీలే కాదు.. ఓటర్లు కూడా ఇంత అహంకారంతో ఎలా రాజకీయాలు చేస్తారని ఆశ్చర్యపోతున్నారు.
ప్రజలను దురాశకు పోయారని బీఆర్ఎస్ నిందలు
ఏదో నాలుగు పైసలకు దురాశపడి వాళ్లకు ఓటేశారు కానీ ఇంక ఆ తప్పు చేయవద్దన్నట్లుగా కేసీఆర్ ప్రతీ సభలోనూ చెబుతున్నారు. కాంగ్రెస్ రాగానే ఏమీ రావడం లేదని ఆయన చెబుతున్నారు. అసలు ప్రజలు గాలి పీల్చుకోలేకపోతున్నారని.. బీఆర్ఎస్ వస్తే తప్ప ప్రజలు బతకలేరన్నట్లుగా చెబుతున్నారు. వర్షాలు పడకపోవడం వల్ల వచ్చిన సమస్యల్ని బీఆర్ఎస్ లేకపోవడం వల్లే వచ్చిన సమస్యగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని.. దిద్దుకోవాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక కేటీఆర్ సంగతి చెప్పాల్సి న పని లేదు. ఆయన అసలు ఓటమిని అంగీకరించడమే లేదు.
ప్రజలు ఇచ్చే తీర్పు ఏదైనా వంద శాతం కరెక్ట్ !
ప్రజలు ఇచ్చేతీర్పు ఏదైనా వంద శాతం కరెక్ట్. అందులో మరో ఆలోచన ఉండదు. పదేళ్ల పాటు రక్తమాంసాలు చిందించి ప్రజల కోసం కష్టపడ్డామని .. అయినా ఓటేయలేదని నిందించడం తప్పే. ఎందుకంటే వారు అవకాశం ఇచ్చారు కాబట్టే చేయగలిగారు. ఇక అవకాశం ఇవ్వకూడదనుకున్నారు. ఇక్కడ అధికారం ఇచ్చిన ప్రజల్ని ఎలా వేధించారన్నది ట్యాపింగ్ అంశాలతోనే బయటపడుతోంది. ఇదంతా పక్కన పెడితే.. ప్రజలు చాన్సివ్వలేదు.. వేరే వారికి ఇచ్చారు.. ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. ఓటర్లను నిందిస్తే.. వచ్చేదేమీ ఉండదు.
బీఆర్ఎస్ ఉంటేనే రోజు గడుస్తుంది..లేకపోతే గడవదు అనే నేరేషన్ అహంకారమే !
కేసీఆర్ సీఎంగా ప్రగతి భవన్ లో తలుపులు బిడాయించుకుని ఉంటే.. బయట ప్రజలు హాయిగా పంచభక్ష్య పరమాన్నాలతో బతుకూంటారని ప్రచారం చేసుకోవడం సహజమే. అప్పట్లో సమస్యలు లేవా అంటే.. లేకపోతే ఎందుకు ఓడిస్తారు. ఇప్పుడు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పరుగులు పెట్టుకుంటూ పోతున్నారు.. కొండగట్ట దగ్గర బస్సు ప్రమాదం జరిగి అరవై మంది చనిపోతే.. కనీస సాయం కూడా అధికారంలో ఉండి కనీస సాయం కూడా చేయలేకపోయారన్నది ప్రజలు మర్చిపోతారా ?. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంటే స్వర్గం లేకపోతే నరకం అని .. సొంత మీడియా.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే స్వయంతృప్తి మిగులుతుంది తప్ప.. ప్రజల అభిమానం పొందలేరు.
మారితేనే భవిష్యత్ !
ఇప్పటికే ఈ అహంకార శైలి వల్ల నేతలంతాఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ప్రజలు ఎన్నికల ద్వారానే దూరమయ్యారని తేలిపోయింది. ఇప్పుడు మొదటి నుంచి ప్రారంభించాలి అంటే అందరి అభిమానాన్ని పొందాలి. నిందలేయడం.. అహంకారం చూపడం ద్వారా అది సాధ్యం కాదని.. బీఆర్ఎస్ నేతలుతెలుసుకోవాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నారని నమ్మిస్తే వారే వెంట వస్తారనుకుంటే అంత కంటే రాజకీయ అమాయకత్వం ఏమీ ఉండదు.