నిజామాబాద్లో బలమైన అభ్యర్థిని చూస్తున్నామని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ కవిత గురించి మాత్రం చెప్పడం లేదు. కవిత కంటే మెరుగైన అభ్యర్థి బీఆర్ఎస్ లో ఎలా ఉంటారన్న సందేహం ప్రతి ఒక్కరికీ వస్తోంది. కానీ కవిత పేరును అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కానీ ఎందుకో చెప్పడం లేదు . కవిత కూడా నిజామాబాద్ లో పోటీకి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవడం లేదు. పరిస్థితి చూస్తే ఆమె పూర్తిగా లోక్ సభ ఎన్నికల నుంచి డ్రాప్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది.
నిజామాబాద్ నుంచి పోటీ చేయడానికి గతంలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంపీ అర్వింద్ తో సై అంటే సై అని సవాళ్లు చేశారు. పసుపు బోర్డు గురించి.. ఆయనిచ్చిన బాండ్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. పోరాటం చేశారు. అర్వింద్ పై మాటల దాడి మీడియాలో హైలెట్ అయింది. అరవింద్ ఎక్కడకు వెళ్లినా బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం.. దాడులు చేయడం వంటివి కూడా జరిగాయి. అయితే హఠాత్తుగా అంతా చల్లబడిపోయింది. బీఆర్ఎస్ నేతల్లో నిర్వేదం కనిపిస్తోంది.
నిజామాబాద్ లోక్ సభ నుంచి కవిత కన్నా బలమైన అభ్యర్థి ఎవరూ ఉండరు. ఎవరైనా సెలబ్రిటీని తెచ్చి నిలబెట్టాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి రావడానికి దిల్ రాజు ఆసక్తికరంగా ఉన్నారు. అయితే ఆయన చూపు అప్పట్లో టీఆర్ఎస్ తరపున ఉందేమో కానీ తర్వాత కాంగ్రెస్ వైపు ఉంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కే ప్రిఫరెన్స్ ఇవ్వొచ్చు. దిల్ రాజు కాంగ్రెస్ తరపున నిలబడితే పోటీ కాంగ్రసె్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతుంది. కవిత నిలబడితే ముక్కోణపు పోటీ ఉంటుంది.
కవిత పోటీ చేయకపోతే బీజేపీకి పాస్ఓవర్ ఇచ్చినట్లే అన్న అభిప్రాయం కూడా ఉంది. బీజేపీతో అంతర్గత ఒప్పందాల ప్రకారం ఇలా చేస్తున్నారన్న గుసగుసలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.