తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. కానీ బీఆర్ఎస్ మాత్రం తమకేమీ తెలియదని అంటోంది. అలాగే ఉండాలని తమ పార్టీ నేతలకు చెబుతోంది. పోటీ చేయడం కాని ఎవరికైనా మద్దతు ఇవ్వడం కానీ ఉండదని సంకేతాలు పంపుతోంది. దీంతో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండనుంది.
ఇప్పటికిప్పుడు కేసీఆర్ ను సీఎంను చేయడానికి ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని కేటీఆర్ అంటూ ఉంటారు. అలాంటి మూమెంట్ ను ప్రత్యక్షంగా ఆవిష్కరించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల కంటే మంచి వేదిక ఏముంటుంది ?. ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీలను కూడా గెలిపించుకునేవారు. రానురాను ఉద్యమవేడి తగ్గిపోయే సరికి ఇప్పుడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలకూ పోటీ పెట్టలేని పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. అది తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఈ ఎన్నికంటే పెద్ద మార్గం ఏముంటుంది ?
కానీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా లేరు. గెలవడం కాదు కనీసం పోటీ ఇవ్వలేకపోతే అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన వస్తుందని అందుకే పోటీకి దూరంగా ఉండటం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్ తన శక్తివంచన లేకుండా పోరాటం చేస్తోంది. సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెట్టినా.. క్షేత్ర స్థాయిలోనూ రోజూ ఏదో ఓ కార్యక్రమం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడం ఆ పార్టీ క్యాడర్ కు నైతికంగా ఎదురు దెబ్బే అవుతుంది.
మరో వైపు కేటీఆర్.. అసలు వచ్చేచాన్స్ లేని ఉపఎన్నికలకు తాము రెడీఅని.. వారినికోసారి ట్విట్టర్ ప్రకటన చేయడం కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేయడానికి కారణం అవుతోంది.