టీఆర్ఎస్ పేరు మార్చడం ఎంత వ్యూహాత్మక తప్పిదమో బీఆర్ఎస్ కు తెలిసి వస్తోంది. అధికారం కోల్పోయిన వెంటనే ఈ తప్పిదాన్ని గుర్తించినప్పటికీ రోజులు గడుస్తున్నా కొద్ది దాని ప్రభావం ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. టీఆర్ఎస్ పేరు మార్చడం అంటే తెలంగాణతో ఆ పార్టీ పేగు బంధాన్ని తెంచుకోవడమే. అందుకే అందివచ్చిన రాజకీయ అవకాశాలను కూడా బీఆర్ఎస్ ఒడిసిపట్టలేని నిస్సహయ స్థితికి చేరుకుందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర గీతంగా అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణకు స్వరకల్పన కీరవాణి చేయడం పట్ల తీవ్ర దుమారం రేగుతుండగా.. ఈ అంశంపై బీఆర్ఎస్ నోరు మెదపకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి మళ్లీ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ విఫలం అవుతోన్న బీఆర్ఎస్… ఈ వివాదంపై సైలెంట్ గా ఉండటంపై జోరుగా చర్చ జరుగుతోంది. కేవలం రాష్ట్ర అధికారిక చిహ్నంలో రేవంత్ సర్కార్ చేస్తోన్న మార్పులపైనే అభ్యంతరం చెబుతోంది తప్పితే,కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నట్లుగా ఏపీకి చెందిన కీరవాణితో రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేయించడంపై బీఆర్ఎస్ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు.
ఇందుకు కారణం ఏంటన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. పార్టీ పేరును మార్చడం ఓ కారణమైతే…గతంలో ఆ పార్టీ ఏపీకి చెందిన నాయకులతో వ్యవహరించిన తీరు కూడా ఓ రీజన్ అని విశ్లేషిస్తున్నారు. అదే పార్టీ పేరు మార్చి ఉండకపోయుంటే సర్కార్ విధాన నిర్ణయాలపై ఉద్యమ నాటి తరహాలో టీఆర్ఎస్ సారధ్యంలో ఉద్యమాలు బయల్దేరి ఉండేవన్న వాదనలు బీఆర్ఎస్ క్యాడర్ లో వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ గా పార్టీ పేరును మార్చడం ఎంత తప్పిదమో ఇప్పుడు క్రమంగా తెలిసి వస్తుందని క్యాడర్ పెదవి విరుస్తోంది.