ఏపీలో వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయి కానీ ఇప్పుడిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్కు మూడు అంటే మూడు సీట్లు వస్తాయి. అందులో రెండు గజ్వేల్, సిద్దిపేట. వినడానికి కాస్త అతిశయంగా ఉన్నా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఫలితాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో… అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆధిక్యాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి మూడు చోట్ల మాత్రమే ఆధిక్యత లభించింది.
లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆధిక్యతలను చూస్తే.. కాంగ్రెస్ పార్టీ తన స్థానాలు కొన్ని మారినా మొత్తంగా 64 సీట్లలో ఆధిక్యాన్ని చూపించుకుంది. బీజేపీ ఏకంగా 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యాన్నిచూపించింది. మజ్లిస్ పార్టీ తన ఏడు సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని నిలుపుకుంది. నాంపల్లిలో మాత్రం.. వెనుకబడింది. అక్కడ కాంగ్రెస్ ది ఆధిపత్యం అయింది. బీఆర్ఎస్ కు మాత్రం మూడు సెగ్మెంట్లలోనే ఆధిక్యం వచ్చింది.
నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39సీట్లను సాధించుకుంది. కాంగ్రెస్ మిత్రపక్షంతో కలిసి అరవై ఐదు గోల్చుకోగా.. బీజేపీ ఎనిమిది దగ్గర ఆగిపోయింది.
ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కోసం ఆత్మ బలిదానం చేసుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పరిస్థితి చూస్తూంటే అదే నిజమన్న అభిప్రాయం అందరికీ కలుగుతోంది. ఇక నుంచి బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోనుంది.