గ్రూప్ వన్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో తెలంగాణలో యువత రగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ లీకేజీ కారణంగా ఓ సారి రద్దు చేశారు. ఆ లీకేజీలో కింది స్థాయి వ్యక్తుల్ని బాధ్యుల్ని చేసేశారు. మరోసారి ఎగ్జామ్ పెట్టారు. కానీ సరైన పద్దతులు పాటించకపోవడంతో హైకోర్టు మరోసారి రద్దు చేసింది. దీంతో నిరుద్యోగులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీపై అనేక అనుమానాలు ముసురుకున్నాయి. అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయా లేకపోతే.. దొరికిన వారే దొంగలా అన్న అని లోలోప మథనపడుతున్నారు
సీఎం కేసీఆర్ ఎన్నికలకు వెళ్లే ముందే ఎనభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వరుసగా భర్తీ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ న్యాయపరమైన చిక్కుల్లో పడిపోవడంతో ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. అసలు ఉద్యోగాల భర్తీ సక్రమంగా జరిగిందా అని సిన్సియర్ గా ప్రయత్నించి విఫలమైన వారి మనసుల్లో అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ కలిసి బీఆర్ఎస్పై యువతలో అసంతృప్తి పెరిగేలా చేస్తున్నాయి.
పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజల్లో ఉండే అసంతృప్తికి తోడు కొత్తగా వస్తున్న సమస్యలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక.. తల పట్టుకుంటున్నారు. ఓ వైపు రాజకీయ అంశాలను.. మరో వైపు పాలనా వ్యవహారాలను ఒకే సారి డీల్ చేయడం కత్తిమీద సాములా మారడంతో.. రెండింటిలోనూ తేడాలు వచ్చేస్తున్నాయన్న ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుంది.