తెలంగాణ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయడం లేదు. కానీ కాంగ్రెస్ ఓడిపోవాలన్న ఉద్దేశంతో బలమైన వ్యతిరేక ప్రచారం అయితే చేసింది. ఎన్నికల ప్రచారాన్ని చేసినంతగా కేటీఆర్, కవిత , హరీష్ రావు ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనే వేయవద్దన్న సంకేతాలను పంపారు. అందుకే రేవంత్ రెడ్డి మరి ఏ పార్టీకి ఓటు వేయమని చెబుతున్నారో చెప్పాలని సవాల్ చేశారు. బీజేపీకి మద్దతుగా వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజానికి రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పాల్సిన పని లేదు. బీఆర్ఎస్ క్యాడర్ కు.. బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని సంకేతాలు వెళ్లాయి.
అయితే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఆ పార్టీపై భారీగా వ్యతిరేకత పెరిగిపోయిందన్న అభిప్రాయం బలపడుతుందని బీఆర్ఎస్ ఈ పని చేస్తోందని అనుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగితే దాని వల్ల బీఆర్ఎస్ కు ప్రయోజనం కలగకపోతే.. ఆ వ్యూహం స్వయం వినాశనం కోసం అన్నట్లుగానే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు బలపడే దశలో ఉంది. ఆ పార్టీకి ఒక్క చాన్స్ అనే అడ్వాంటేజ్ ఉంది. ప్రజలు అనుకుంటే ఆ పార్టీకి అవకాశం ఇస్తారని పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఎనిమిది సీట్లు నిరూపించాయి. అలాంటి పార్టీకి పరోక్ష మద్దతు ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం ?
బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ను బీజేపీ మెల్లగా కైవసం చేసుకుంటోందనేది బహిరంగంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో బీజేపీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా బీఆర్ఎస్ రాజకీయం చేయాల్సి ఉంది. కానీ అలాంటి ప్రయత్నాలు చేయకుండా.. కేవలం కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. దీని వల్ల కాంగ్రెస్ పై పెరిగే వ్యతిరేకత బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందో లేదో కానీ.. బీజేపీకి మాత్రం ఉపయోగపడుతుందని అంటున్నారు. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ చేస్తున్న తప్పిదాలు.. ఆ పార్టీకి ముందు ముందు పెద్ద సమస్యను సృష్టిస్తాయన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో ఉంది.