తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతోందని ప్రచారం మొదలైంది. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ కావడంతో మరికొద్ది రోజుల్లోనే కేబినెట్ విస్తరణ పక్కా అని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే, ఈసారి రెండు మంత్రిపదవులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఓ మాజీమంత్రి ద్వారా సంప్రదింపులు జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కొన్నాళ్లుగా ఆగిపోయిన వలసలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. దీంతోనే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా 25మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారాన్ని మొదలు పెట్టినట్లు కనబడుతోంది.
ఆ 25మంది ఎమ్మెల్యేలు ఎవరో ఎర్రబెల్లి చెప్పలేదు. కానీ, ఆయన మంత్రివర్గ విస్తరణ కసరత్తు జరుగుతోన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఎదో గుట్టు ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్, హరీష్ తరుచుగా ఎమ్మెల్యేలు అసంతృప్తి అంటున్నారు కానీ, రియాక్షన్ ఉండటం లేదు అందుకే ఈసారి పార్టీని కాపాడుకునేందుకు ఎర్రబెల్లిని రంగంలోకి దించి ఉంటారనే ప్రచారం నడుస్తోంది.