బీఆర్ఎస్ పార్టీ ప్రతి రోజా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయడం సహజమే. కానీ హఠాత్తుగా న్యాయవ్యవస్థపై కామెంట్లు ప్రారంభించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల ప్రస్తావన తీసుకువచ్చారు. తెలంగాణ హై కోర్టు కు 42 మంది జడ్జిలు ఉండాలని నిర్ణయం తీసుకున్నా ఎపుడూ 23 మంది కి మించి భర్తీ చేయడం లేదన్నారు.
తెలంగాణ జడ్జీల్లో ఎస్సీ ,ఎస్టీ లకు సంబంధించిన వారు ఎవ్వరూ లేరని.. పూర్తి స్థాయిలో జడ్జీలను నియమిస్తే దళిత గిరిజన వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్ హయాం లోనే మేము పార్లమెంటు లో ఒత్తిడి చేసిన ఫలితంగా హై కోర్టు జడ్జీల సంఖ్యను 42 కు పెంచారని హై కోర్టు లో పెండింగ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగి పోతోంది ..జడ్జీలు పూర్తి స్థాయిలో ఉంటె తప్ప కేసులు తొందరగా పరిష్కారం కావన్నారు.
హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయి లో జడ్జీల నియమాకానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సామాజిక న్యాయం న్యాయ వ్యవస్థ లో కూడా పాటించాల్సిందే నని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణ హై కోర్టులో నలుగురు జడ్జీలు ఉన్నారన్నారు. జడ్జీలు పూర్తి స్థాయిలో ఉంటేనే తెలంగాణ కు కూడా న్యాయం జరుగుతుందన్నారు.
బీఆర్ఎస్ నేతలను కేసులు చుట్టుముడుతున్న సమయంలో ఆ పార్టీ నేతలు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. జడ్జిల నియామకం విషయంలో సామాజిక న్యాయం, తెలంగాణ హైకోర్టులో నలుగురు ఇతర రాష్ట్రాల వారున్నారని వ్యాఖ్యానించడం వెనుక వ్యూహం ఉందని అంటున్నారు.