పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ తెగ సంబరపడిపోతోంది. ఆ పార్టీ అంచనాలే నిజమై బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ కు అభ్యర్థుల గండం పొంచి ఉండొచ్చుననే రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలతో ఆ పార్టీకి మంచి పట్టు దొరికింది. అదే దూకుడడును కొనసాగించాలని అనుకుంటున్న బీజేపీ…ఇప్పుడు ఉప ఎన్నికలు గనుక వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ లను మట్టి కరిపించి సత్తా చాటేందుకు ఏ అవకాశాన్ని వదులుకోదు అన్నది ఓపెన్ సీక్రెట్.
బై ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు ఎలాగూ మారరు..కానీ, బీఆర్ఎస్ నుంచి బీజేపీ అభ్యర్థులను ఆకర్షించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. మరోవైపు.. బీఆర్ఎస్ అధికారంలో లేదు..ఆ పార్టీ తరఫున గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు..అదే బీజేపీలో చేరి గెలిచినా, ఓడినా పార్టీలో ప్రాధాన్యత దక్కడంతోపాటు వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సత్తా చాటే అవకాశం ఉండటంతో…భవిష్యత్ కోసం బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎంచుకునే అవకాశం లేకపోలేదు.
సో, ఎలా చూసినా బీఆర్ఎస్ కు ఉప ఎన్నికలు అనేవి అగ్ని పరీక్షలా మారుతాయని, బీఆర్ఎస్ కు బీజేపీ పోటు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.