ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకుంటున్న కేసీఆర్ .. అక్కడి ఖర్చులు కూడా తెలంగాణ నేతలకే అప్పచెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో తొలి సారిగా బహిరంగసభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగసభ పెడుతున్నారు. ఆ సభ బాధ్యతలు.. జన సమీకరణ మొత్తం.. సౌండ్ పార్టీలయిన సొంత నేతలకే అప్పగించారు. నాందేడ్ జిల్లా కేంద్రంలో రెండు శాసనసభ నియోజకవర్గాలుండగా, జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అన్ని ప్రాంతాల నుంచి జన సమీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
నాదెండ్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల ఏర్పాటు చేసిన నేతలు తమ ఫోటోలను కూడా ప్రముఖంగా ప్రచురించుకున్నారు. హైదరాబాద్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా ఈ ఏర్పాట్లలో పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. ఆయనతో పాటు సరిహద్దు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే రెండు వారాలుగా అక్కడ తిరిగుతున్నారు. నాందెడ్ నుంచే కాకుండా ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ప్రజల్ని సమీకరించి.. సభ భారీగా విజయవంతం చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు.
బీఆర్ఎస్లో నేతల్ని చేర్పించడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఔట్ డేటెడ్ అయినా పర్వాలేదు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే.. వారిని బీఆర్ఎస్లో చేరేందుకు ఆహ్వానిస్తున్నారు. కేసీఆర్ త్వరలో విశాఖలో కూడా బహిరంగసభ పెట్టాలని అనుకుంటున్నారు. కానీ గట్టి నాయకులు దొరకడం లేదు. గంటా లాంటి నేతలపై చేరిక ప్రచారాన్ని కొన్ని అనుకూల మీడియాలతో ప్రారంభించారు కానీ… ఆయనకు పార్టీ మారాలనుకుంటే వైసీపీ, బీజేపీ లాంటి ఆప్షన్లు ఉంటే బీఆర్ఎస్లో ఎందుకు చేరతారనేది ఎవరికైనా వచ్చే సందేహం. ప్రస్తుతం తెలంగాణ నేతలే విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. చేరికలుఉంటాయో లేదో స్పష్టత లేకుండా పోయింది.