దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల చర్చ ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో… అన్ని పార్టీలు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాయి. లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటం, కేంద్రం కూడా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్న సందర్భంలో తెలంగాణలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటీ అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు పూర్తికాలం పాలనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటుంది. జాతీయ పార్టీ ఇప్పటికే జమిలీకి నో చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ స్టాండ్ క్లియర్. ఇక బీజేపీ ఎలాగూ జమిలీకి సై అంటోన్న నేపథ్యంలో… బీఆర్ఎస్ స్టాండ్ పై చర్చ సాగుతోంది.
అయితే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ సిద్ధం అన్న మాట బయటకు చెప్తోంది. నిజానికి బీఆర్ఎస్ కు వీలైనంత త్వరగా ఎన్నికలు రావటమే కావాలి. దాని వల్ల ఆ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీకి కొనసాగుతున్న వలసలు ఆగుతాయని గులాబీ బాస్ బలంగా నమ్ముతున్నారు. పైగా, మొన్నటి ఎన్నికల్లో అబద్ధపు హామీలకు ప్రజలు ఓట్లేశారని, ఇప్పుడు బాధపడుతున్నందున… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటారని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది.
దీంతో జమిలీకి మేం రెడీ అని బహిరంగంగా చెప్పకున్నా… తమకు మాత్రం ఎన్నికలు రావాలనే ఉంది. బహిరంగంగా చెప్తే కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకొని… గత ఎన్నికల్లో ప్రచారం చేసినట్లే బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే, అందుకే జమిలీకి మద్ధతిచ్చాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.