ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజకీయంలో కూరుకుపోతున్నారు. ఆయన ప్రభుత్వం ఇచ్చిన పదవి తీసుకోవడంతో ఆయన కాంగ్రెస్ నేతగా మారిపోయారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమకు పెద్ద అనే హోదాను రేవంత్ అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి చిత్ర పరిశ్రమ కోసం ఏదైనా మాట్లాడాలంటే ఇక దిల్ రాజు ద్వారానే. ఇది బీఆర్ఎస్ నేతలు ఆయనను టార్గెట్ చేయడానికి కారణం అవుతోంది.
చిత్రపరిశ్రమతో రాజకీయాలు చేయవద్దని కేటీఆర్ కు దిల్ రాజ్ కౌంటర్ ఇచ్చిన వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఆయన దిల్ రాజు కాదని.. డీల్ రాజు అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ఆయన డీల్ చేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తొత్తులా వ్యవహారిస్తున్నారని గతంలో కొండా సురేఖ.. నాగార్జున, కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
దిల్ రాజు ఇక మొహమాటపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయన ఇంకా పూర్తి స్థాయి రాజకీయ నేత కాదు. సినీ పరిశ్రమకు సంబంధించి అయితే ఆయన స్పందిస్తారు కానీ.. బీఆర్ఎస్ నేతలు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే.. రాజకీయంగా టార్గెట్ చేస్తే స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ సినీ పరిశ్రమను టార్గెట్ చేస్తే.. అలాగే సినీ పరిశ్రమను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం వెంటనే రెస్పాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.