బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిక్కెట్ మీకే అని సంకేతాలు పంపినా సిట్టింగ్ ఎంపీలు కొంత మంది జంప్ కొడుతున్నారు. లేకపోతే పోటీ చేసేది లేదని చెబుతున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించారు . కానీ కాంగ్రెస్ పార్టీ.. పట్నం మహేందర్ రెడ్డి కుటుంబమే బెటరని డిసైడై.. ఆ మేరకు వారిని పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరిపోయారు. నిజానికి ఆయన కూడా కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు.
కానీ నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో ఆయన బీజేపీ వైపు చూశారు. ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. పోతుగంటి రాములకు టిక్కెట్ లేదని బీఆర్ఎస్ చెప్పలేదు. కనీసం అభ్యర్థిని మారుస్తామన్న సంకేతాలు కూడా ఇవ్వలేదు. కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేక ఆయన పార్టీ మారిపోయారు. దీంతో నాగర్ కర్నూలుకు వేరే అభ్యర్థిని బీఆర్ఎస్ వెదుక్కోవాల్సి ఉంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని కూడా పార్టీ మారిపోయారు. సిట్టింగ్ ఎంపీల్లో పోటీ చేసే వారు తగ్గిపోతున్నారు. కొత్తప్రభాకర్ రెడ్డి ఎంపీగా వెళ్లారు.. నేతకాని వెంకటేష్, రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు ఇలాంటి ఒక్కొక్కరు రేసు నుంచి వైదొలుగుతున్నారు.
ఈ పరిణామాల్లో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం.. బీఆర్ఎస్ అధినేతకు సవాల్ లాంటిదే. ధీటైన అభ్యర్థులను నిలబెట్టకపోతే.. బీఆర్ఎస్ ముందే రేసు నుంచి వైదొలిగినట్లవుతుంది. అదే జరిగితే.. ఫలితాలు ఘోరంగా ఉంటాయి. అది పార్టీ భవిష్యత్ పై ప్రభావం చూపిస్తుంది. గత ఎన్నికల వరకూ అభ్యర్థి ఎవరన్నది కాకుండా. కారు గుర్తు పని చేసేది.. కానీ ఇప్పుడు .. కారు గుర్తు కన్నా.. అభ్యర్థి బలం ముఖ్యం అవుతోంది. కీలక నేతలందర్నీ ఎప్పుడో దూరం చేసుకోవడంతో… ఇప్పుడు అభ్యర్థుల సమస్య ఎదురవుతోంది.