తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉద్రిక్త స్థాయిని దాటి చంపడం.. చావడం వరకూ వెళ్లిపోతున్నాయి. అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా బాధ్యతా రాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు చంపడం.. చావడం భాష మాట్లాడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉందని చావడానికైనా చంపడానికైనా సిద్ధమని ఆయన చెబుతున్నారు. తాము ఎవరికీ భయపడేది లేదన్నారు.
ఇదంతా ఎందుకంటే.. ఢిల్లీ స్థాయిలో పెడుతున్న కేసుల గురించే. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో రాకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. దర్యాప్తు సంస్థలు తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడతాయని… ప్రచారం జరుగుతున్న సమయంలో ఇసలా బెదిరింపుగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లేవు. రాజకీయ హత్యల్లేవు. ఏపీతో పోలిస్తే కక్ష సాధింపులు చాలా తక్కువ. కానీ శ్రీనివాస్ గౌడ్ మాత్రం ముందుకెళ్లిపోయారు.
బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. 2023లో అతి పెద్ద జోక్ ఇదేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటిరిగానే పోటీ చేస్తుందని అన్నారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో సీఎం కేసీఆర్ విశాల దృక్పథంతో పని చేస్తారని చెప్పుకొచ్చారు.