తెలంగాణ రాజకీయ పార్టీల్లో కాస్త అడ్వాంటేజ్ అన్న పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్లోనూ … ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీరుతో గందరగోళం ఏర్పడుతోంది. ఇటీవలి కాలంలో కేసీఆరే ఏ రాజకీయ వ్యూహమూ పక్కాగా చేపట్టడం లేదు. ఎప్పుటికప్పుడు వాయిదాలు వేసుకుంటున్నారు. ఓ పేస్ లేకపోవడంతో బీఆర్ఎస్ పై క్రేజ్ అంతకంతకూ తగ్గిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో ఔట్ డేటెడ్ నాయకుల్ని … బీఆర్ఎస్ ఫేస్లుగా ఎంచుకోవడం దగ్గర్నుంచి… తెలంగాణలో సెక్రటేరియట్ ప్రారంభం వరకూ ఏదీ కేసీఆర్ స్థాయిలో లేదన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.
సచివాలయం ప్రారంభానికి తేదీ ఖరారు చేసినప్పుడే… ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని తెలుసు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ వస్తుందని కూడా తెలుసు. అయినా ముహుర్తం ఖరారు చేశారు. నిజానికి ఇదేమీ పెద్ద అడ్డంకి కాలేదు. ఒక్క లెటర్ రాస్తే ఈసీ కూడా అనుమతి ఇస్తుంది. కానీ వాయిదాకే మొగ్గు చూపారు .. అందుకే ఎలా అయినా అనుమతి తీసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే బహిరంగ సభ కూడా వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్ వరకూ ఉండదన్న సంకేతాలను కూడా బీఆర్ఎస్ చీఫ్ ఇచ్చారు. ఈ ప్రకారం చూస్తే కేసీఆర్ రిలాక్స్ అయిపోయారన్న వాదన వినిపిస్తోంది.
మీ జోలికి మేం రాం.. ..మా జోలికి మీరు రావొద్దని అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగంలో కేసీఆర్ పేర్కొన్నారు. ఈ వైపు నుంచి ఏమైనా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయేమోనని అందుకే కేసీఆర్ జోరు తగ్గించారన్న వాదన వినిపిస్తోంది. కారణం ఏదైనా కేసీఆర్ మాత్రం… ఊహించినంతగా దూకుడుగా వెళ్లడం లేదు. ఇది బీఆర్ఎస్ నేతల్నీ గందరగోళానికి గురి చేస్తోంది. తెలంగాణలో మాత్రమే హడావుడి చేస్తే… ఏం ప్రయోజనం అని… ఇతర నేతలూ ఫీలవుతున్నారు.