బీజేపీ, బీఆర్ఎస్ విలీనంపై గంటకో వార్త చక్కర్లు కొడుతోంది. కేటీఆర్, హరీష్ ఢిల్లీలో వారం రోజుల పాటు పడిగాపులు పడి చివరికి డీల్ సెట్ చేసుకున్నారని… రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకునేలా ఒప్పందం చేసుకున్నారని పుకారు ప్రారంభమయింది. అది లోకల్ లో వచ్చింది కాదు.. ఢిల్లీలో పుట్టిందే. అక్కడ్నుంచి తెలంగాణలో స్వైరవిహారం చేస్తోంది. మొదట రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేస్తారని తర్వాత … పార్టీని అని చెబుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు చైర్మన్ ధన్ ఖడ్ను కలిశారు. ఎందుకు కలిశారో తెలియదు.
ఈ రాజకీయంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్ వైపు నుంచి స్పందన లేకపోవడం. ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీష్ లలో ఎవరైనా సరే.. తాము బీజేపీతో ఎలాంటి చర్చలు ఒప్పందాలకు రాలేదని.. విలీనం అన్నమాటే లేదని చెప్పాల్సి ఉంది. కానీ వారు సైలెంట్ గా ఉంటున్నారు. మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా అందరూ నిజమేనని నమ్ముతున్నారు.
నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరి… వారిని నేరుగా కేసీఆర్ పంపారనే అనుకుంటారు. ఎందుకంటే దానికి తగ్గట్లే పరిణామాలు జరుగుతున్నాయి. కవితకు బెయిల్ కోసం పార్టీని పణంగా పెడుతున్నారన్న విమర్శలూ వస్తాయి. వారి పాటికి వారు బీజేపీ ఆకర్ష్ కు లోనైపోయి వెళ్లినట్లుగా రాజకీయం చూపించి ఉంటే ఎఫెక్ట్ వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా హైకమాండే చర్చలు జరిపి బీజేపీలోకి పంపుతోందని జనం అనుకుంటే.. మొదటికే మోసం వస్తుంది. మరి ఇప్పటికైనా కేటీఆర్, హరీష్ లు స్పందిస్తారా ?