తెలంగాణ కాంగ్రెస్ లో మొదటి జాబితాలు పది లేదా పదకొండు మంది అభ్యర్థులు ఉంటారు అనుకుంటే కేవలం నలుగురికి మాత్రమే చోటు దక్కింది. దీంతో అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుందా అన్న చర్చ ప్రారంభమయింది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత అంతా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారని అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా అలాగే అనుకున్నారు. మొదటి అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. రెండో అభ్యర్థిగా ప్రకటించకపోయినా చేవెళ్లలో సభ పెట్టి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఓటేయాలన్నట్లుగా ప్రచారం చేశారు. మొదటి జాబితాలో వంశీ చంద్ రెడ్డికి టిక్కెట్ ఖరారైనా .. పట్నం సునీత పేరు మాత్రం రాలేదు.
బీఆర్ఎస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన నలుగురు పేర్లు మొదటి జాబితాలో రావాల్సి ఉంది. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధును పోటీకి దించాలని నిర్ణయించింది. ఈ నలుగురు కూడా ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. అయితే వీరి విషయంలో హైకమాండ్ వేరే ఆలోచన చేసింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు నేతృత్వంలోని సర్వే టీం రంగంలోకి దిగింది. అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసే పనిలో పడిందని తెలుస్తోంది.
సర్వే ఆధారంగా టికెట్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది. పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్న వారి అంశాన్ని కూడా సర్వే టీములు ప్రస్తావించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్టు సమాచారం. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ లో చేరి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకే చివరికి ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎవరు చేసినా… ఫిరాయింపు నేతలకే ఎక్కువ ఎంపీ టిక్కెట్లు లభించడం ఖాయంగా కనిపిస్తోంది.