తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే వాదిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. టీడీపీలో ఉండి వచ్చిన వారు తమ వాయిస్‌ను బలంగా వినపిిస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్న వారు కూడా చంద్రబాబుది అక్రమ అరెస్టు అని నిర్మోహమాటంగా చెబుతున్నారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. కానీ అధికారికంగా బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి మాత్రం ఈ అరెస్టుపై ఎలాంటి స్పందన లేదు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. ఆయన కూడా చంద్రబాబు అరెస్ట్ కక్ష పూరితమని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు పాలన చేస్తున్నారని విమర్శించారు. స్పీకర్ పోస్టులో ఉన్న వ్యక్తి ఇలాంటి విమర్శలు చేయడం కలకలం రేపింది. పైగా ఆయన భారత రాష్ట్ర సమితి కీలక నేత. అలాగే మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుతో విబేధించి .. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు గా ప్రచారం చేశారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు చంద్రబాబుకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు.
తెలంగాణలో చంద్రబాబుకు మద్దతుగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఐటీ ఉద్యోగుల ప్రదర్శనలపై పోలీసులుఉక్కుపాదం మోపినప్పటికీ ఇతర చోట్ల జరుగుతున్న నిరసనలకు మాత్రం సహకరిస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వయంగా ర్యాలీకి నాయకత్వం వహించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా చంద్రబాబు అరెస్టు అక్రమం అని జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలపై బీఆర్ఎస్ హైకమాండ్ విధానపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమీ మాట్లాడవద్దని చెబితే మాట్లాడేవారు కాదు. అలాగని అరెస్ట్ తప్పు అని కేసీఆర్,కేటీఆర్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. కానీ క్యాడర్ ను.. నేతల్ని నిలువరించడం లేదు. దీని వెనుక రాజకీయం ఉందని భావిస్తున్నారు.