కౌశిక్ రెడ్డిని కంట్రోల్ లో పెట్టుకోకపోవడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారుతోంది. ఆయన చేస్తున్న స్క్రిప్టెడ్ డ్రామాలు బీఆర్ఎస్ పరువు తీస్తున్నాయి. ఆయన సృష్టిస్తున్న పరిస్థితులకు పార్టీ మొత్తం స్పందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అది కౌశిక్ రెడ్డి వేస్తున్న ట్రాప్ లాగా ఉందని.. ఆయన చిల్లర రాజకీయానికి బీఆర్ఎస్ ను కామెడీ చేస్తున్నారన్న అసంతృప్తి సీనియర్ నేతల్లో కనిపిస్తోంది.
కౌశిక్ రెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ నేతల ఇళ్లపైకి వెళతానని సవాల్ చేస్తారు. దాని వల్ల ఎంత న్యూసెన్స్ క్రియేట్ అవుతుందో చెప్పాల్సిన పని లేదు. తాజాగా పోలీసుల మీద అదే రుబాబుగా చూపించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయనకు సపోర్టు చేసిన వారు ఒక్కరూ లేరు. పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వాలంటే పద్దతి ఉంటుంది. అంతే కానీ డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుందని గౌరవించరా అని చొక్కా పట్టుకున్నంత పని చేస్తే ఎవరు సహిస్తారు. ఆయనపై కేసు పెట్టడంతో పార్టీ అంతా కదలాల్సి వచ్చింది.
రోజంతా జైళ్లు, పరామర్శల సమయం గడిచింది. అసలు ఎందుకు ఇదంతా అంటే.. ప్రభుత్వంపై పోరాటం అని ఎవరూ అనుకోలేరు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి జైల్లో రుబాబుగా చేసింది ప్రభుత్వంపై పోరాటం కాదు.. ప్రజా సమస్యల కోసం కాదు. బీఆర్ఎస్ తాము పోరాడుతున్నామని.. అరెస్టులు చేస్తున్నారని చెప్పుకోవడానికి ఇదిబాగానే ఉంటుంది కానీ.. దూరంగా ఉండి చూసే ప్రజలకు మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేసుకోకపోతే.. బీఆర్ఎస్ ను ప్రజల్లో మరింతగా జోకర్ గా మార్చేస్తారని సీనియర్లు మథనపడుతున్నారు.