తెలంగాణ రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ఆడుకుంటున్నాయి. ఇదే మా తొలి జాబితా అంటూ… మీడియాకు లీక్ చేస్తున్నారు. మీడియాలో కొన్ని పేర్లతో హడావుడి జరిగిపోతోంది. శ్రావణ మాసం రాగానే తొలి జాబితా ప్రకటించేస్తామని హంగామా చేస్తున్నారు. కానీ నిజంగా ప్రకటించడానికి మాత్రం అవకాశం లేదని.. ఎక్కువ మంది నమ్ముతున్నారు. దీనికి కారణం గట్టి పోటీ ఉండటమే.
గత మూడు, నాలుగు నెలల నుంచి ఇదిగో అభ్యర్థుల జాబితా.. అదిగో జాబితా అంటున్నారు. ఇప్పుడు శ్రావణ శుక్రవారం అంటున్నారు. బీఆర్ఎస్సేనా మా జాబితాలు కూడా రెడీ.. మేమేమీ వెనుకబడి లేమని కాంగ్రెస్, బీజేపీ లీకులిస్తున్నయి. నిజానికి ఈ విషయంలో కేసీఆర్ చాలా ముందే ఉన్నారు. బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు జాబితా కూడా రెడీ చేసుకున్నారు. అనేక రకాల సర్వేలు చేసి.. అభ్యర్థి బలాబలాలను బేరీజు వేసుకుని జాబితా సిద్ధం చేసుకున్నారు ఫ కానీ కేసీఆర్ నేరుగా జాబితా ప్రకటించరని .. షెడ్యూల్ ప్రకటించే వరకూ ఆగుతారన్న అంచనాలు కూడా అదే పార్టీలో వినిపిస్తున్నాయి.
కేసీఆర్ జాబితా ప్రకటించేస్తారన్న ప్రచారం ప్రారంభం కాగానే కాంగ్రెస్ , బీజేపీ కూడా అదే తరహా సమాచారాన్ని మీడియాకు లీక్ చేశాయి. తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ జాబితాకు హైకమాండ్ ఆమోదం తెలిపితే త్వరలోనే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని చెబతున్నారు. కొంత మంది పేర్లతో ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ కూడా అదే చెబుతోంది. రాష్ట్రంలో బీజేపీ నుంచి ఉన్న నలుగురు ఎంపీలతోపాటు, సీనియర్ నేతలంతా అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తోంది మొత్తంగా 60 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయాలనే నిర్ణయంతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు
ఇవన్నీ తాము వెనుకబడిపోయామన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడకుండా ఉండటానికేనన్న వాదన వినిపిస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న రాజకీయంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏకపక్షంగా అభ్యర్తుల్ని ప్రకటించదు. ఇతర పార్టీల తరపున నిలబడేవారిని చూసి.. వారికి తగ్గ ప్రత్యర్థిని ఎంపిక చేయాలని అనుకుంటారు. ఒక పార్టీ కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మిగిలిన ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడాన్ని వ్యూహంగా భావిస్తూంటాయి.
బీఆర్ఎస్ చీఫ్ అనుకుంటే అభ్యర్థుల ప్రకటన చేయవచ్చుకానీ.. జాతియ పార్టీల్లో అభ్యర్థుల ప్రకటన అంత తేలిక కాదు. ఆ పార్టీల కేంద్ర ఎన్నికల కమిటీలు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మాత్రం అనుకున్నట్లుగానే అభ్యర్థుల్ని ప్రకటించే చాన్స్ ఉంది. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థుల్ని ప్రకటించే చాన్స్ లేదని.. ఇతర పార్టీలపై మైండ్ గేమ్ కోసం కొన్ని పర్లు లీక్ చేసే అవకాశం ఉంది.