హైదరాబాద్ షేక్ పేట్ లో ఓ వ్యక్తి డ్రైనేజీలో పడి మృతి చెందటానికి కాంగ్రెస్ కారణమని బీఆర్ఎస్ ఆరోపించడం కామెడీగా అనిపిస్తోంది. కాంగ్రెస్ వచ్చి మూడు నెలలు అవుతున్నా డ్రైనేజీ మరమ్మత్తులు పూర్తి చేయకపోవడమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తున్నారు. అయితే ఈ మరమ్మత్తులకు రెండేళ్ల కిందటే అంటే బీఆర్ఎస్ హయాంలోనే పునాది పడటం గమనార్హం. వీటిని పట్టించుకోకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ టార్గెట్ గా తప్పుడు ప్రచారం చేస్తూ దొరికిపోతోంది.
షేక్ పేట్ లో వ్యక్తి దుర్మాణానికి కాంగ్రెస్ కారణమనే వాదన నిజమైతే… బీఆర్ఎస్ హయాంలో వరదల సమయంలో డ్రైనేజీలో గల్లంతైన వారి మరణాలకు బీఆర్ఎస్ కారణం కాదా..? ఖచ్చితంగా కాదని చెప్పలేం. ప్రతి ఏడాది ఎవరో ఒకరు డ్రైనేజీలో కొట్టుకుపోయిన ఘటనలు ఆనవాయితీగా జరిగాయి. నగరంలో నాలాలు, డ్రైనేజీల మరమ్మత్తుల కోసం వేల కోట్లు ఖర్చు చేశామని ఆర్భాటంగా ప్రకటించారు కేటీఆర్. అయినా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగుతున్నాయంటే ఇది బీఆర్ఎస్ వైఫల్యం కాదా..? పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు అపఖ్యాతిని అంటగట్టుకోవడం కాదా? బీఆర్ఎస్ నేతలే ఆలోచించాలి.
హైదరాబాద్ ను విశ్వనగరంగా చేసినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మూడు నెలల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటే… హైదరాబాద్ అభివృద్ధి కేవలం ప్రచారమే అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. ఇలాంటి విమర్శలు చేసేముందు బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ , రాజకీయ ప్రయోజనాల కోసం చిల్లర ఆరోపణలు చేస్తే ప్రజల్లో అభాసుపాలు కావాల్సి వస్తుందనేది గుర్తుంచుకుంటే మంచిది.
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అత్యుత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఇష్యులో కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలనే ఆలోచనే కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం కొన్నిసార్లు కామెడీగా అనిపిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్లు ఏం చేసిందనే ప్రశ్నలు జనాల్లో మెదులుతున్నాయి. వీటిని ఏమాత్రం అంచనా వేయకుండా ప్రతి దుర్ఘటనను కాంగ్రెస్ ఖాతాలో నమోదు చేయాలని చూడటం బీఆర్ఎస్ లేకి తనాన్ని స్పష్టం చేస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.