రెడ్ బుక్ రాస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఎందుకంటే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని.. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని.. బీఆర్ఎస్ నేతల్ని వేధిస్తున్నారని వారి పేర్లన్నింటినీ రెడ్ బుక్లో రాసుకుంటున్నట్లుగా ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన చేయాల్సింది కేటీఆర్ లేదా కేసీఆర్. వారు మాత్రం ఇంకా పూర్తిగా సీన్ లోకి రాలేదు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం తెరపైకి వచ్చేశారు. బహుశా.. నియోజకవర్గ స్థాయి రెడ్ బుక్ ను కౌశిక్ రెడ్డి ప్రిపేర్ చేస్తారేమో కానీ.. రాష్ట్ర స్థాయిలో మాత్రం ఇది కేటీఆర్కే సొంతం.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రెడ్ బుక్ ను ప్రిపేర్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారసభల్లో ప్రకటించారు. బీఆర్ఎస్కు అనుకూలంగా అధికార దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని ఖచ్చితంగా రెడ్ బుక్లో రాసుకుని అధికారంలోకి వచ్చాక శిక్షిస్తామని హెచ్చరిస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక కొంత మంది అధికారుల పనిబట్టారు. కానీ ఇంకా చాలా మంది దిలాసాగానే ఉన్నారు. వారు కాంగ్రెస్ లలోని ఇతర నేతల ప్రాపకంతో హాయిగా ఉన్నారని అంటున్నారు.
అసలు ఈ రెడ్ బుక్ అనే సంప్రదాయం తీసుకు వచ్చింది నారా లోకేష్. టీడీపీ నేతల్ని వేధిస్తున్న వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఈ రెడ్ బుక్ అధికారుల్ని ఎంతగా భయపెట్టిందంటే ఆ కారణం చూపి కోర్టులకు..సుప్రీంకోర్టుకూ వెళ్లారు. ఇప్పుడు వారు పర్యవసానానాలు అనుభవించబోతున్నారు.