అవును.. కేసీఆర్ మనోస్థైర్యాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే దెబ్బతీస్తున్నారు. కేసీఆర్ నిర్వహిస్తోన్న సమావేశానికి హాజరు అవుతూ తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని సంకేతాలు పంపుతూనే మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. భవిష్యత్ బీఆర్ఎస్ దేనని కేసీఆర్ భరోసాతో కవ్విన్స్ అయినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలాడిస్తూనే.. కాంగ్రెస్ తో చేరేందుకు పోటీపడుతుండటం గమనార్హం.
బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపై కాంగ్రెస్ కన్నేయడంతో బీఆర్ఎస్ బాస్ అలర్ట్ అయ్యారు. వరుసగా పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎవరూ తొందరపడి పార్టీని వీడోద్దని కేసీఆర్ చెప్తుండటంతో అందుకు ఎమ్మెల్యేలు అంగీకరిస్తూనే..కాంగ్రెస్ లో చేరేందుకు తొందరపడుతుండటంతో ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారోనని టెన్షన్ బీఆర్ఎస్ బాస్ ను వేధిస్తోంది. మంగళవారం నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడీ, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.
మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డిలు తాజాగా కేసీఆర్ తో సమావేశానికి హాజరై తాత్కాలికంగా కాంగ్రెస్ లో చేరికలకు చెక్ పెట్టినా.. వారు బీఆర్ఎస్ లోనే కొనసాగే పరిస్థితి లేదనే ప్రచారం జరుగుతోంది. పార్టీలోనే కొనసాగుతామని కేసీఆర్ ను నమ్మిస్తూనే కేసీఆర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అందుకే చేరికలను అడ్డుకునేందుకు కేసీఆర్ సమావేశాలతోనే సరిపెడుతున్నారు తనదైన యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగడం లేదని అభిప్రాయపడుతున్నారు.