కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పరంపర ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లోపే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రక్రియను కంప్లీట్ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ ఈమేరకు స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.
అయితే, ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వేహించిన రోజే బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మరో ఎమ్మెల్యే…మొత్తం ఐదు మంది ఎమ్మెల్యేలు తాజాగా కేసీఆర్ నిర్వహించిన అత్యవసర భేటీకి డుమ్మా కొట్టారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాలనే కేసీఆర్ తో సమావేశానికి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో చేరేందుకు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారని, ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరికల విషయమై కాంగ్రెస్ పెద్దల అపాయింట్ మెంట్ కోరారని…అపాయింట్ మెంట్ ఖరారు కాగానే నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది.