ఒకే ఒక్క భేటీ బీఆర్ఎస్ షేకైపోయింది. ఎంతగా అంటే.. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో అదే పనిగా ప్రెస్మీట్లు పెట్టించి.. తాము పార్టీ మారడం లేదని గట్టిగా చెప్పించేంతగా. అది పైకి కనిపించేది కానీ అంతర్గతంగా మాత్రం బీఆర్ఎస్ షేకైపోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జరగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెల్చుకుంది. ఆందోల్, మెదక్ తప్ప అన్ని సెగ్మెంట్లలనూ బీఆర్ఎస్ గెలిచింది.
ఆ జిల్లా పూర్తిగా హరీష్ రావు అధీనంలో ఉంటుంది. అలాంటి జిల్లాలో ఎవరికీ తెలియకుండా నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లి ముఖ్యమంత్రితో సమావేశం కావడం అనేది జరగదు. పార్టీలో ముఖ్య నేతలతో ఎంతో కొంత సమాచారం ఉండే ఉంటుంది. హరీష్ రావుకు పూర్తిగా తెలుసని.. ఆయనకు తెలియకుండా ఆ భేటీ జరగని చెబుతున్నారు. ఇది కూడా బీఆర్ఎస్లో అలజడి రేగడానికి మరో కారణం అయింది. పైగా నలుగురిలో సునీతా లక్ష్మారెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న నేత. పటాన్ చెరు ఎమ్మెల్యేకు పవర్ లేకపోతే పూట గడవదు.
తెలంగాణలో బాగా ఆదాయం వచ్చే నియోజకవర్గాల్లో అది ఒకటి. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఇంచార్జిదే రాజ్యం. మిగతా వారిదీ అదే పరిస్థితి. అందుకే వారు రేవంత్ రెడ్డిని కలిశారు. కానీ కాంగ్రెస్ తో చర్చలు జరపలేదు. చేరాలా లేదా.. చేరితే ఏమొస్తుందన్న చర్చలు జరగలేదు. కానీ ఒక్క భేటీ మాత్రం జరిగిపోయింది. దీంతో ఆ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ లో అపనమ్మకం ప్రారంభమయింది. రేవంత్ తల్చుకుంటే బీఆర్ఎస్ ను ఊడ్చేస్తారన్న ప్రచారమూ ఉపందుకుంది.
ప్రభుత్వ మనుగడపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలన్నీ.. ఒక్క దెబ్బకు తేలిపోయేలా రేవంత్ రెడ్డి చేశారు. ఈ ఊపు కొనసాగిస్తే.. పార్లమెంట్ ఎన్నికల సమయానికి .. బీఆర్ఎస్ బిక్కిరి బిక్కిరి అయిపోతుంది.