బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కండువాలు కప్పుతున్నారు. ఏకంగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని చెబుతున్నారు కానీ ఆయన ఒక్కొక్కరినే పిలిచి కండువాలు కప్పుతున్నారు. ఇది పార్టీ ఫిరాయింపులేనని ఓ వైపు బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది. అయినా రేవంత్ మాత్రం వ్యూహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒక్కొక్కరే ఎందుకు.. అందర్నీ ఒకే సారి పిలిపించి కండువాలు కప్పవచ్చు కదా అని డౌటనుమానం కాంగ్రెస్ క్యాడర్ లోనూ వస్తోంది.
కాంగ్రెస్ లో చేరడానికి ఐదారుగురు తప్ప అందరూ రెడీగా ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కనుసైగ చేస్తే.. రేవంత్ సీఎం అయిన రెండో రోజు కాంగ్రెస్ లో చేరిపోయి ఉండేవారు. చాలా సార్లు తన ఆలోచన చెప్పారు. ఇంకా ఆయనకు పిలిచి కండువా కప్పలేదు. కానీ కాంగ్రెస్ తో ఆయన పూ ర్తి స్థాయి టచ్ లో ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. కానీ వీరికి కాకుండా… ఇతరుల్ని పిలిచి కండువా కప్పేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయాలనుకుంటే ఒకే సారి అందర్నీ చేసుకోవచ్చు. ఆ పని చేయడం లేదు. నిన్న ప్రకాష్ గౌడ్ ను పిలిచి కండువా కప్పితే నేడు అరికెపూడి గాంధీని చేర్చుకోబోతున్నారని చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. కేసీఆర్ పై రేవంత్ మైండ్ గేమ్ అడుతున్నారని.. ఒక్క సారే చేర్చుకుని ఆయనను ప్రశాంతంగా ఉండనీయడం కంటే… ఒక్కొక్కరిని చేర్చుకుని మానసిక వేదన కలిగించాలని అనుకుంటున్నారని భావిస్తున్నారు.
ఇలా ఒక్కొక్కర్ని పిలిచి కండువాలు కప్పుతూంటే మిగతా వాళ్లు చేరడానికి ఆసక్తి చూపలేదేమో అనుకుంటున్నారు. కానీ వారి అంచనాల్ని తర్వాత రోజే మరో ఎమ్మెల్యేలను చేర్చుకుని తలకిందులు చేస్తున్నారు.