తాను పాలు పోసిన పెంచి పాము తననే కాటేసినట్లు… తాను అలవాటు చేసిన పార్టీ ఫిరాయింపులు తన మెడకే చుట్టుకుంటున్నాయి కేసీఆర్ కు. 2014, 2018 ఎన్నికల తర్వాత ఏ పార్టీలో గెలిచినా… అంతా గులాబీ గూటికే అన్నట్లుగా పార్టీ మారగా, ఇప్పుడు కాంగ్రెస్ బదులు తీర్చుకుంటుంది.
ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్. మరో ఎమ్మెల్యే త్వరలో కారు దిగబోతున్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా… ఇంకెవరు ఉంటారో, ఎవరు పోతారో అన్న సందేహాలు గులాబీ క్యాడర్ లోనూ వ్యక్తం అవుతున్నాయి.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల దృష్ట్యా… కాంగ్రెస్ పార్టీకి బలం లేనందున, జీహెచ్ఎంసీలో అనుసరించాల్సి వ్యూహాలపై గ్రేటర్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 10మంది కార్పోరేటర్లు సహ పలువురు ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
తలసాని పార్టీ మారుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ తలసాని అధ్యక్షతనే ఈ గ్రేటర్ మీటింగ్ కొనసాగింది. కానీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, అరికెపూడి గాంధీ డుమ్మా కొట్టారు.
మాములుగా అయితే ఇలాంటి మీటింగ్స్ కేటీఆర్ నిర్వహిస్తారు. కానీ, కేటీఆర్ ఢిల్లీలో ఉండి తలసాని ఈ మీటింగ్ నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది.