బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ఇంటర్యూలను ప్రో బీఆర్ఎస్ మీడియా హడావుడిగా ప్రసారం చేసింది. సమయం.. సందర్భం లేకుండా ఈ ఇంటర్యూలను ప్రసారం చేయడం ఆసక్తికరంగా మారింది. మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె పోరాడుతున్నట్లుగా కవర్ చేయడానికి ఈ ఇంటర్యూలను డిజైన్ చేశారు. పనిలో పనిగా ఆమెపై ఢిల్లీ లిక్కర్ కేసు గురించి కూడా మాట్లాడించారు. అందులో తన ప్రమేయం ఏమీ లేదని.. కేంద్రంపై పోరాడుతున్నందుకే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినందున తదుపరి .. కవితనే అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే కవిత కూడా ఇటీవల తరచూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నేతలు చెబితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. అయితే వారు చేయాలనుకుంటే ఇలాంటి ప్రకటనలను పట్టించుకోరు. ఇప్పటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ ఓ పద్దతి ప్రకారం వెళ్తున్నాయి. మొదట్లో బీజేపీ నేతలే తామే దర్యాప్తు చేస్తున్నట్లుగా కవిత పేరు సహా అందరి పేర్లు ప్రకటించారు. కానీ సీబీఐ మాత్రం మెల్లగా విచారణ జరుపుతూ ఒక్కొక్కరి వివరాలు కోర్టు ముందు పెట్టి అరెస్ట్ చేస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం పరిణామాలు చూస్తే కవిత అరెస్ట్ ఖాయమని తేలడంతోనే ఢిల్లీలో ధర్నాకు ప్లాన్ చేశారని అంటున్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. మహిళా రిజర్వేషన్లను డిమాండ్ చేయనున్నారు. వచ్చే శుక్రవారం ఈ ధర్నా జరగనుంది. ఈ లోపు కవిత మీడియా ఇంటర్యూలు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ హడావుడి చూస్తూంటే.. సీబీఐ నుంచి ఏమైనా సంకేతాలు అంది ఉంటాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.