రాష్ట్ర స్థాయిలో అధికారం పోవడంతో బీఆర్ఎస్ పార్టీ దిగువ స్థాయిలో కూడా ఖాళీ అయిపోతోంది. మున్సిపాల్టీల్లో క్యాడర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తోంది. ఫలితంగా స్థానిక సంస్థల్లో అధికారం మారిపోతోంది. వారిని ఆపలేని నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ నేతలు పడిపోయారు. ఎక్కువ మంది మాజీ మంత్రులు.. తాజా మాజీ ఎమ్మెల్యేలు.. చివరికి ఎమ్మెల్యేలు కూడా వారిని బుజ్జగించడానికి ఆసక్తి చూపించడం లేదు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40కిపైగామున్సిపాల్టీల్లో చైర్మన్, మేయర్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రతిపాదించారు. . అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు బీఆరెస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. దీంతోపాటు సొంత పార్టీలోని అసమ్మతి కారణంగా బీఆరెస్ కౌన్సిలర్లు మెజార్టీగా అవిశ్వాసాలకు మద్దతునిస్తున్నారు. స్థానిక అధికారం చేతుల్లోకి వస్తూండటంతో మున్సిపాల్టీల్లో అధికార సాధనకు పోటాపోటీ నెలకొంది. మూడేళ్లపాటు అధికారంలో ఉన్నవారిని చూసి తమకు కూడా అధికారం కావాలన్న లక్ష్యంతో కొందరు కౌన్సిలర్లు ఉన్నారు. మరికొందరు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి మారిపోతున్నారు.
బీఆర్ఎస్ ముఖ్య నేతలు ద్వితీయ శ్రేణి నేతల పదవులు కాపాడలేకపోతున్నారు. వారు పార్టీ మారకుండా ఆపలేకపోతున్నారు. ఫలితంగా క్యాడర్ బలహీనం అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నిజానికి బీఆర్ఎస్ క్యాడర్ స్వతహాగా ఎదగలేదు. వారంతా ఇతర పార్టీల వాళ్లే. కేసీఆర్ అధికారం అండతో పై స్థాయ నేతల్ని ఎలా ఆకర్షించారో కింది స్థాయి నేతలు… ఇతర పార్టీల వారిని అలాగే పార్టీలోకి ఆహ్వానించారు. వారంతా రాజకీయ అధికారం కోసం వచ్చారు. ఇప్పుడు అది బీఆర్ఎస్ దగ్గర పోవడంతో.. వచ్చిన వారంతా రివర్స్ అవుతున్నారు. రాజకీయాల్లో సిద్ధాంతపరంగా ఉండే క్యాడర్ను ప్రోత్సహించడంలో బీఆర్ఎస్ విఫలం కావడంతోనే ఇప్పుడీ సమస్య వస్తోంది.