ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను ఎంపిక చేసుకొని తర్వాత వదిలేసుకున్న బీఆర్ఎస్ కు ఆ అవసరం ఏపాటిదో క్రమంగా అర్థం అవుతోంది. వ్యుహకర్తగా అపాయింట్ చేసుకున్న సునీల్ కనుగోలు వ్యూహాలతో కాంగ్రెస్ వినూత్న రీతిలో క్యాంపెయిన్ చేస్తుండగా బీఆర్ఎస్ మాత్రం కాలం చెల్లిన విధానాలతోనే ప్రచారం చేస్తోంది. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ నమూనాను రేవంత్ రెడ్డి ప్రదర్శించడం ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. దీంతో జనాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీ – కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోన్నా అధికంగా నష్టపోయేది మాత్రం బీఆర్ఎస్సే.
అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో ఎంపీ ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ కొత్త తరహాలో పొలిటికల్ క్యాంపెయిన్ ప్రధానంగా బీజేపీ – కాంగ్రెస్ లనే ఎన్నికల రేసులో నిలుపుతున్నాయి. బీఆర్ఎస్ ఎక్కడా చర్చలో లేకుండా పోతోంది. రెండు పార్టీలు వ్యూహాత్మక రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ ను చర్చలో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అంటున్నా ఆ పార్టీ వైపు జనాలను అట్రాక్ట్ చేసేలా వినూత్నమైన ఆలోచనలతో ప్రచారం చేయకపోవడం కారు పార్టీకి మైనస్ గా మారింది.
అందుకే బీఆర్ఎస్ కు ఓ వ్యూహకర్త అవసరమని…లేదంటే ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు వ్యుహకర్తలు అవసరమే లేదని కేసీఆర్ ఒక్కరు చాలునని గతంలో ఆ పార్టీ నేతలు ప్రకటించినా అది ఎలాంటి నష్టం చేసిందో అసెంబ్లీ ఎన్నికల ఫలితమే నిదర్శనం. ఎలాంటి బేషజాలకు వెళ్ళకుండా పార్టీ భవిష్యత్ కోసం అర్జెంట్ గా ఆ పార్టీ ఓ వ్యూహకర్తను నియమించుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. లేదంటే పార్టీ ఉనికే ప్రమాదంలో పడే ఆకాశం ఉందంటున్నారు. అదే సమయంలో సమయం మించిపోయిందని..వ్యూహకర్తగా ఎవరూ వచ్చినా బీఆర్ఎస్ ను గాడిలో పెట్టడం అసాధ్యమని అంటున్నారు.