భారత రాష్ట్ర సమితికి ప్రస్తుతం ఏదీ కలిసి వస్తున్నట్లుగా లేదు. బ్రహ్మాండంగా ఉన్న భవనాలను కూల్చేసి అద్భుతం సృష్టించామని కొంత కాలంగా కొత్త సచివాలయం గురించి చేసుకుంటున్న ప్రచారం అంతా ఎండా కాలంలో కురిసిన చిన్న పాటి వర్షానికి డ్రైనేజీలో కలిసిపోయింది. ఓపెన్ నాలా కారణంగా ఓ చిన్నారి ప్రాణం కోల్పోవడంతో అసలు హైదరాబాద్ మౌలిక వసతులపై చర్చలు ప్రారంభమయ్యాయి. అసలు ఇది వర్షా కాలం కాదు. ఎండా కాలం. క్యూములో నింబస్ లేదా మరో కారణంతో పడే వర్షాలు.. అంత తీవ్రంగా ఉండవు. ఓ గంట.. అరగంట దంచి కొడతాయి . దానికే కాలనీలకు కాలనీలు మునిగిపోతున్నాయి.
ఇది ఎప్పుడూ ఉండేదే. అయితే ఎందుకు బాగు చేయడం లేదన్నది అసలు ప్రశ్న. ఐటీ కారిడార్ ను చూపించి లండనా .. న్యూయార్క్ హైదరాబాదా ఆని అనుకుంటున్నారని తెలంగాణ పాలకుడు డప్పు కొడుతున్ారు కానీ అసలు జనం ఉండే కాలనీల సంగతేమిటన్న ప్రశ్న ప్రధానంగా వస్తోంది. తెలంగాణ సచివాలయం విషయంలో పబ్లిసిటీ పీక్స్‌కు చేరిన సమయంలో.. అదీ కూడా సచివాలయం ప్రారంభం రోజునే.. ఓ గంట పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించడంతో ఉత్సాహం అంతా నీరు కారిపోయింది.
ఎంత కాదనుకున్నా.. మహా నగరంలో మరో కోణాన్ని ఈ వర్షం బయట పెట్టింది. సహజంగానే చేసుకుంటున్న పబ్లిసిటీకి.. వాస్తవానికి తేడా ఏమిటో వర్షం బయట పెట్టిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఘటనలపై ప్రభుత్వం వీలైనంత తక్కువగా స్పందించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. కొత్త సచివాలయం బడాయిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.